About

బొత్సను పశువులతో పోలిస్తే.. వాటికీ అవమానమే: సోమిరెడ్డి, దేవినేని

Written By sreenu on Sunday, April 22, 2012 | 8:35 PM

హైదరాబాద్, ఏప్రిల్ 22 : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను పశువులతో పోలిస్తే వాటిని అవమానించినట్లే అవుతుందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డితో కలిసి ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ విచారణకు భయపడినందునే ఐపీఎస్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేయించిన పీసీసీ అధ్యక్షుడు బొత్సకు తాము విజయనగరంలో తలపెట్టిన ధర్నాపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.


మద్యం సిండికేట్లు వర్ధిల్లాలంటూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందా ? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం ఎమ్మార్పీ ధరలు పెంచాలని బొత్స సత్యనారాయణ ధర్నా చేస్తే మంచిదేమోనని ఎద్దేవా చేశారు. బొత్స నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. 20 ఏళ్ల క్రితం నాటి జీవితాన్ని ఒకసారి వెనుదిరిగి చూసుకోవాలని బొత్సకు సూచించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ విజయనగరం డీసీసీ అధ్యక్షుడు చెప్పిన మాటలు బొత్సకు తెలియవా అని ప్రశ్నించారు. 'బొత్స ఫోక్స్‌వ్యాగన్‌లో తిరుగుతున్నాడు. ఆ పరిశ్రమ మాత్రం వేరే రాష్ట్రానికి తరలిపోయింది. మేమూ మంత్రులుగా ఉన్నాం. కానీ అయనలా బలవలేదు. కుంభకోణాలకు పాల్పడలేదు' అన్నారు.

విజయనగరంలో తమ సభను అడ్డుకుంటే తెలుగుదేశం శ్రేణులన్నీ రోడ్డెక్కుతాయని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ తాటాకు చప్పుళ్లకు బెదరబోమన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చంచల్‌గూడ జైల్లో అదనపు గదులు కట్టించాలని, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ జైలుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే రెండేళ్లలోగా పోలవరం పనులను పూర్తి చేస్తామంటూ జగన్ చెబుతున్న మాటలను ఉమామహేశ్వరరావు జోక్‌గా కొట్టిపారేశారు. బందర్ పోర్టు పనుల జాప్యానికి నిరసనగా సోమవారం కృష్ణా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.

0 comments:

Post a Comment